img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Monday, November 14, 2011

మా తుఝే సలాం

          (23 యేళ్ళ ఇరీనా ముఖంలో కారుణ్యం,
98 యేళ్ళ ఇరీనా చిరునవ్వుల్లో ప్రతిబింబించే జీవన సాఫల్యం)

                                ఈ సృష్టి మొత్తంలో ప్రేమకెన్నో రూపాలున్నా నిర్మలమైనదీ  ఏ స్వార్ధం లేనిదీ,  ఒక్క తల్లి ప్రేమమే. ఇది మిగతా అన్నిటికన్నా అతీతంగా ఉన్నతంగా కనిపిస్తుంది. అందుకు స్థూలంగా కారణాలు రెండు. ఈ బంధం మూలాలు మన రక్తమాంసాల్లో, నరనరాల్లో, కణకణంలోనూ ఉండే అంత లోతు. నిజమే ! ప్రతీ జీవికీ తన భౌతిక శరీరం అమ్మ ఇచ్చినదే. రెండో కారణం, కడుపులో ఏర్పడ్డ పేగుబంధం భూమ్మీద పడ్డాకా కనుమరుగైపోకుండా ఓ అద్రుశ్య పాశంగా మెదిలే తీరు. కన్న బిడ్డకి చిన్న గాయమైనా తల్లి మనసు విలవిలలాడే అంతటి అనుబంధం అది. కానీ చిత్రంగా ఏ కారణాలతో నిమిత్తం లేకుండా, అమ్మవ్వడానికి కేవలం నిండైన "అమ్మ మనసుంటే" చాలన్న నిజాన్ని లోకానికి రుజువుచేసినవారు ఇద్దరున్నారు. ప్రపంచం చూసిన ఆ ఇద్దరు మాతృమూర్తుల్లో ఒకరు మదర్ తెరిస్సా ఐతే రెండోది ఇరీనా శాండ్లర్. ఆర్తుల మీద అవ్యాజమైన ప్రేమా, కరుణా, వర్షించారు. ఆపన్నులని కడుపులో దాచుకొని కాపాడి, పునర్జన్మనిచ్చి, మాతృత్వానికి మహోన్నతమైన మరో అర్దం చెప్పారు. మొదటి పేరు తెలీని వారుండరు, రెండో అమ్మని మీకు  పరిచయం చేయడానికే ఈ కాలం.


            ఫిబ్రవరి14  ప్రేమకి పుట్టిన రోజైతే, మూర్తీభవించిన ఆ ప్రేమే ఫిబ్రవరి 15న పోలాండ్ లో ఓ పసిపాపగా పుట్టింది, పేరు ఇరీనా. తల్లి తండ్రులదగ్గరే పెరిగి పెద్దయ్యింది. ఇరీనా తండ్రి ఓ వైద్యుడిగా టైఫస్ సోకిన యూదులకి చికిత్స చేస్తూ అదే టైఫస్ వ్యాధితో ఆమె 7వ యేట కన్ను మూసాడు. రెండో ప్రపంచయుద్ధమప్పుడు హిట్లర్ సారధ్యంలో జెర్మనీ పోలాండ్ని ఆక్రమించి అక్కడి యూదుల మారణహోమానికి తలపెట్టింది. అందుకుగానూ వార్సా లో ఓ శిబిరాన్ని ఏపర్చింది. దానిపేరు ఘెట్టో. ఘెట్టో లో ప్రబలిన టైఫస్ వ్యాధిని నియంత్రించకపోతే నాజీ సైనికులు కూడా దానికి బలయ్యే ప్రమాదముందని యూదులకి చికిత్సను ముమ్మరం చేసారు. అందులో భాగంగా  పెరిగి పెద్దదై ఇరీనా ఓ సోషల్ వర్కర్ గా పనిచేస్తూ వ్యాధికి మందులు పంపిణీచేసేది, వ్యాధి సోకకుండా పిల్లలకి టీకాలు వేసేది. ఆ కారణంగా తనకి శిబిరంలొకి వచ్చిపొయే వెసులుబాటుండేది. యూదులకి సహాయపడినట్టు నాజీలకి ఏమాత్రం అనుమానమొచ్చినా తను ప్రాణాలతో ఉండని తెలిసీ యూధుల పిల్లలని ఘెట్టో బయటి సురక్షిత ప్రాంతాలకి చేరవేసే సాహసకృత్యానికి నడుము బిగించింది. "If you see a man drowning, you must try to save him even if you can not swim" అన్న తన తండ్రి మాటలని ఆకళింపుజేసుకొంది, తండ్రి బాటలోనే తనూ అడుగులేసింది. అప్పటికి తన వయసు కేవలం 23 యేళ్ళు. నిజానికి సాహసాలూ త్యాగాలూ అక్కర్లేని వయసది. కానీ కళ్ళముందు యూదుల జీవితాలని నియంతలు కాలరాస్తుంటే చెలించకుండా ఉండలేకపోయింది. చరిత్రలో హిట్లర్ చేసిన యూదుల మారణహోమం నేటికీ ఎన్నో కుటుంబాలు, జీవితాలు మర్చిపోలేని ఓ పీడకల. అవి ఆ తరం ఆనవాళ్ళని ఙ్ఞాపకాలనుంచీ చెరిపి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి.  కానీ  కరాళనృత్యం చేసే ఆ కాళరాత్రిలో ఎందరికో కరదీపికగా నిలిచింది ఇరీనా. కర్కశమైన నాజీ సైనుకుల బూట్ల కింద యూదుల పసి చిగురులని చితికిపోకుండా కాపాడి, కంటికి రెప్పలా చూసుకొని సురక్షిత ప్రాంతాలకి చేరవేసింది. వెరసి ఓ కొత్తలొకానికి తను "అమ్మ"య్యింది.
                                                                 పారిశుధ్య తనిఖీల పేరిట తను రోజూ శిబిరాన్ని సందర్శించినప్పుడు కొందరు పిల్లలని గోనె సంచుల్లో, కొందరిని పనిముట్ల పెట్టెల్లో, ఇంకొందరిని తన నర్సింగ్ వ్యాన్లో గుట్టుగా దాచిపెట్టి ఘెట్టో బయటకి తరలించేది. వార్సా మున్సిపల్ సోషల్ సర్వీస్ డెపార్ట్మెంట్లో తన తోటి నర్సులూ, నాజీలకు వ్యతిరేకంగా పనిచేసే  "జెగోటా" అనే అండర్ వోర్ల్డ్ సంస్థవారు తనకి అండగా నిలిచారు. చెర్చ్ ఫాదర్లూ, యూదుల పిల్లలకి ఆశ్రయమివ్వడానికి ముందుకొచ్చిన కొన్ని పోలిష్ కుటుంబాల సాయంతో తన ఆశయసాధనకి రూపకల్పన చేసింది. పసి పిల్లలని తరలించేప్పుడు వాళ్ళ ఏడుపు కాపలా ఉన్న సైనికులకి వినబడకుండా ఉండేందుకు తనతోటే ఓ కుక్కనుంచుకొనేది. సైనికులని చూసిన ప్రతీ సారీ ఆ కుక్క మొరిగేలా దానికి తర్ఫీదిచ్చింది. ఆ విధంగా అనుమామొస్తే కాల్చిచంపే నరరూప రాక్షసుల మధ్యలోంచీ మొక్కవోని ధైర్యంతో, మొహానికి చిరునవ్వునతికించుకొని, ఏ అనుమానం రాకుండా పసిపిల్లలని కాపాడేది. తను ప్రాణభిక్ష పెట్టిన పిల్లల సంఖ్య పదులు కాదూ వందలు కాదూ, సుమారు 2,500 పైమాటే. 
                                                          1943 లో పిల్లలని తరలిస్తూ తను పట్టుబడిపోయింది. నాజీ సైనికుల చేతిలో కొన్ని వారాలు నరకయాతన అనుభవించాకా ఇరీనాకి ఉరి శిక్ష ఖరారయ్యింది. జెగోటా యంత్రాంగం ఓ సైనికాధికారికి లంచం ఇచ్చి తనని మరణశిక్షనుంచి గుట్టుగా తప్పించారు. బయటి ప్రపంచానికి ఇరీనా చనిపోయినట్టే తెలుసు. చావును అంత చేరువగా చూసాకా కూడా తను గాయాల నుంచీ కోలుకొన్నాకా శిశు రక్షణా చర్యల్లో పాలు పంచుకొంది. యూదుల పిల్లల్లాగే తనూ తన కన్న తల్లికి వీడ్కోలు పలికి రహస్యంగా వార్సా వదలక తప్పలేదు. యుద్దం ముగిసాకా పిల్లలని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకి చేర్చాలన్న ఆలోచనతో తను రక్షించిన ప్రతీ పిల్లా లేదా పిల్లాడి పేరూ, తల్లిదండ్రుల పేర్లూ, తరల్చబడిన ప్రదేశం, ఇత్యాది వివరాలని చీటీల్లో రాసి భద్రపరిచేది. దురదృష్టవశాత్తూ ఎందరో తల్లిదండ్రులు విషవాయు ప్రయోగాల్లో మరణించారు. ఇరీనా రక్షించకపోతే ఆ పసిమొగ్గల గతీ అదే. బ్రతికున్నవాళ్ళల్లో ఎందరో ఆచూకీ గల్లంతయ్యింది.
                                                                       ఇటీవల 2007 లో తన పేరు నోబెల్ శాంతి బహుమతికి శిఫారసుచేబడ్డా నోబెల్ స్థాయి రాజకీయాలవల్ల ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు ఆల్గోరే ని ఆ యేడు నోబెల్ వరించింది. ఏ కీత్రి కిరీటాన్నీ ఆశించని నిరాడంబరమైన అమ్మలకి ఎవార్డులూ రివార్డులతో పనిలేదు. నిజానికి తను కాపాడిన ప్రతీ ప్రాణం తనకో "నోబెల్"  అంత అపురూపం అని మనకి తెలుసు. అలా 2500 "నోబెల్" బహుమతులు సాదించిన అమ్మ తన 98 యేట 2008 లో కన్నుమూసింది. 

"God couldn't be everywhere same time, so he created mothers - Jewish proverb" అన్నది యూదుల సామెత. కానీ దానికి కొనసాగింపుగా విశ్వమానవాళికి అమ్మగా కూడా దైవం పుడుతుందని చూపించింది ఇరీనా జీవితం.

ఎప్పుడో ఓ మదర్ తెరెస్సా , ఎప్పుడో ఓ ఇరీనా శాండ్లర్.... మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ...


ఓ అమ్మ పుడుతుంది

*********************************************************************


ఓ అమ్మ గురించి రాసిన ఈ కమ్మని టపాని మా అమ్మకి పుట్టినరోజు కానుకగా డెడికేట్ చేస్తూ, బ్లాగ్ ముఖంగా మరోసారి పుట్టినరోజు జేజేలు తెలియజేసుకొంటూ

- ఆనంద్