img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Tuesday, May 31, 2011

గతించిన వర్తమానం


ఈ విషయం నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ గారు చెప్పారు.


క్రైస్తవుల సమాధులమీద ఓ శిలాఫలకం ఉంటుంది. దాని మీద మనం సహజంగా ఆ సమాధి చేయబడ్డవ్యక్తి పేరూ, అతను పుట్టిన , మరణించిన తేదీలు లాంటివి చూస్తుంటాము. అయితే కొన్నిటి మీద ఓ సందేశం రాసి ఉంటుంది. దాన్నే ఆంగ్లంలో "ఎపీట్యాఫ్" (Epitaph) అంటుంటారు. సహజంగా ఎపిట్యాఫ్ లో ఆ గతించిన వ్యక్తి జీవిత సారాన్ని క్లుప్తంగా సందేశాత్మకంగా రాస్తారు. ఉదాహరణకి ఆ వ్యక్తి బాగా పిసినారి అనుకోండి. " ద మోర్ యు గివ్ ద మోర్ యు రీప్" లాంటివి రాస్తుంటారు. దాత్రుత్వ గుణాలని ఉపదేసించేదిగా ఉంటుందా వాక్యం.


తపాలా బిళ్ళలూ, కరెన్సీ నాణాలూ సేకరించే అలవాటు కొందరికున్నట్టే ఒకతనికి ఇలా సమాధుల మీద రాసున్న ఎపిట్యాఫ్స్ ని చదివి సేకరించే అలవాటుందిట. ఓ సారి అతను స్మశానంలో అలా సమాధుల మధ్యలోంచీ వెళుతూ కనిపించిన ఎపిట్యాఫ్స్ ని చదువుతున్నాట్ట. అప్పుడు ఈ కింది ఎపిట్యాఫ్ కనిపించిందిట


" Remember friend as you walk by
As you are now so once was I
As I am now you will surely be
Prepare thyself to follow me "


"ఓ బాటసారీ గుర్తుంచుకో ఈరోజు నువ్వెక్కడున్నావో నిన్న నేనూ అక్కడ్డే ఉన్నాను, ఈరోజు నేనెక్కడున్నానో రేపు నువ్వూ తప్పక అక్కడికే వస్తావు కాబట్టి జాగ్రత్తగా గమనించి ముందుకు సాగు " అని దానర్ధం.


లెక్క ప్రకారం సదురు ఎపిట్యాఫ్ సేకరించే వ్యక్తికి దీన్ని చదవగానే కినిచిత్ భయమేయాలి. ఎందుకంటే నిన్న నేనూ నీలాగే ఈ తోవనే సాగానూ రేపు నువ్వూ నాలాగే సమాధిలో పడుకొంటావ్ అని ఆ వాక్యం భయపెట్టినట్టుంది కాబట్టి. కానీ ఆలోచించగా గూఢంగా ఓ అంతరార్ధం దాగుందా ? అనిపిస్తుంది..


కాస్త విశాల ద్రుక్పధంతో చూసినప్పుడు " As you are now so once was I " అంటే నేనూ నిన్నటి రోజున నీలాగా బతికిన వాడినే ! "As I am now you will surely be" అంటే ఏరోజుకైనా ఎవరైనా ఇలా ఆరడుగుల నేలకి పరిమితంకావాల్సిందే అని అర్ధమొస్తుంది. ఆఖరి వాక్యం "Prepare thyself to follow me " లో ఎంతో భావముందనిపిస్తుంది.. జీవితం చిన్నది..బ్రతుకున్నన్నాళ్ళూ ఏరోజుకైనా ఇలా ఆరూడుగుల నేలకే పరిమితమౌతానన్న భావనతో బ్రతుకు. అత్యాశలకీ దురాశలకీ పోకు అని.


పరికించి చూస్తే పైకి భయపెట్టేదిలా ఉన్నా మొత్తానికి హితవుచెప్పే సందేశమే ఇది !