img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Sunday, January 9, 2011

అమ్మ మాట

                                        
ఒక ఊరిలో ఒక చిన్నపిల్లాడుండేవాడు పేరు కిట్టుగాడు. చాలా మంచివాడు, బుద్దిమంతుడి. ఒకసారి కిట్టుగాడు ఒక్కడే వాళ్ళ అమ్మమ్మా వాళ్ళ ఊరెళ్ళవలసి వచ్చింది. వాళ్ళమ్మ వాడికి ఒక చద్దిమూట ఇచ్చి దారిలో ఆకలేస్తే తినమని చెప్పింది. తను ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి క్షేమంగా వెళ్ళేందుకు మూడు జాగ్రత్తలు చెప్పింది. మొదటిది - "ఎవరితోనైనా ఈ చద్దిని పంచుకొని తిను ఒక్కడివీ తినకు". రెండవది - "  నీకంటే పెద్దవాళ్ళు  ఏదైనా చెబితే తప్పకుండా విను, ఎదురుచెప్పకు"  మూడవది - " ఏదైనా సమస్యలొస్తే ఆ భగవంతుడిని తలుచుకో"

పొద్దున్నే కిట్టుగాడు బయల్దేరాడు, మధ్యన్నమయ్యాకా దారిలో బాగా ఆకలేసింది. చద్దిమూట తెరిచి తిందామంటే ఎవరితోన్నన్నా పంచుకోమని చెప్పిన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. అటూ ఇటూ చూడగా ఓ ఇద్దరు కనబడ్డారు గుబురు మీసాలతో ఎర్రటికళ్ళతో చూడబొతే దొంగల్లా ఉన్నారు. ఐనా అమ్మచెప్పినట్టు వాళ్ళని పిలిచి చద్ది కొంచం వాళ్ళకి పెట్టి కిట్టుగాడు తిన్నాడు. " ఈ బుడ్డోడు మనకి బువ్వ పెట్టాడు ఏదైన ఇద్దామంటే మనదగ్గరేమీ లేదే ? ఇంకా ఈ రోజు దొంగతంకూడా చేయలేదు ఇప్పుడెలా ?" అనుకొన్నారు వాళ్ళలో వాళ్ళే " ఓ పని చేద్దాం ఈ బుడ్డోడ్ని మనతోపాటూ దొంగతనానికి తీసుకెళ్ళి ఏదైనా సంపాదించి ఇతనికి కొంచం ఇచ్చి రుణం తీర్చుకొందాం" అనుకొని " బుడ్డోడా నువ్వు మాతో కూడా రా రా " అన్నారు. మళ్ళీ కిట్టుగాడికి అమ్మ మాటలు గుర్తొచ్చాయి  పెద్దవాళ్ళు ఏం చెప్పినా వినాలి ఎదురు చెప్పకూడదు.  కాబట్టి,  "సరే నండీ" అని వాళ్ళ కూడా వెళ్ళాడు.  ఒక ఇంట్లోకి దొంగతనానికి కిట్టుగాడిని తీసుకొని  దొంగలు  వంటింటి వైపుగా దూరారు.  అంతకు ముందే వంటింట్లోకి దూరి పాలు తాగుతున్నపిల్లి వీళ్ళరాకతో బెదిరిపోయి పాలగిన్నె తన్నేసి పారిపోయింది.  ఆ శబ్దానికి ఇంట్లోని వారొస్తారని ఊహించి ఒక దొంగ అటకెక్కేసాడు ఒక దొంగ పడక గదిలో ఉన్న మంచం కింద దూరేసాడు. కిట్టుగాడికి దొంగతనాలు అలవాటు లేవుకాబట్టి అమాయకంగా చూస్తూ వంటింటి బల్ల మీద కూర్చుండిపోయాడు.  ఇంతలో పిల్లి చేసిన శబ్దం విని ఇంట్లో వాళ్ళు రానే వచ్చారు.   కిట్టుగాడిని చూసి " ఎవరు బాబూ నువ్వు ? ఏం పని మా ఇంట్లో ? " అని గద్దించారు కిట్టుగాడికి అమ్మచెప్పిన మూడో విషయం గుర్తొచ్చింది. దేవుడిని తలుచుకొందామని ఇలా అన్నాడు " ఏమోనండీ అంతా ఆ పై వాడు చేసిన పని ఆ పై  వాడే కాపాడాలి నన్ను ఇప్పుడు" అన్నాడు. ఇంతలో అటకపైనున్న దొంగ దూకి " బుడ్డోడా నా పేరే చెబుతావే ఆ మంచంకింద దాగిన రెండోవాడి గురించి చెప్పవే ? " అన్నాడు. ఇంతలో రెండో దొంగనీ ఇంట్లోవాళ్ళు పట్టేసి. "ఎంత తెలివిగా దొంగల్ని పట్టించాడో ఈ పిల్లాడు" అని ఇంట్లోవాళ్ళు మురిసిపోయి కిట్టుగాడికి మిఠాయిలూ పళ్ళూ అన్నీ ఇచ్చి వాళ్ళ అమ్మమ్మా వాళ్ళింటి దగ్గర దిగబెట్టారు.


నీతి : సాటివారికి సాయపడీతే, పెద్దవాళ్ళను గౌరవిస్తే దేవుడు మనని ఎప్పుడూ కాపాడతాడు

కథ కంచికీ మనం ఇంటికీ