img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Saturday, September 3, 2011

హం ఆప్ కే హై కౌన్


ఇది సుమారు నన్ను చిన్ననాటి నుంచీ  కొందరు అడుగుతున్న ప్రశ్న. నేనూ కొందరినడుగుతున్న అదే ప్రశ్న. కానీ గమ్మత్తేంటంటే నన్నెవరైనా అడినప్పుడు చాకచక్యంగా జవాబు చెప్పి తప్పించుకొంటాను. నేనెవరినైనా అడిగినప్పుడు ఒడుపుగా అడిగి ఎదిటివారిని అందులో ఇరికిస్తాను. అదీ తమాషా !
                          చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఊళ్ళెళ్ళినప్పుడు చుట్టాలతో పలకరింపులూ , వచ్చిన కార్యక్రమాన్ని తిలకించడాలూ , విందులూ వినోదాలూ అవీ ఏమాత్రం పట్టనట్టూ  అప్పటికప్పుడు ఏర్పడ్డ నేస్తాలతో ఏదో చోట దొంగాపోలీసో ఇంకోటో ఆడేసుకొంటూ  బిజీబిజీగా ఉండేవాణ్ణి. ఇంతలో బిగ్గరగా నాన్నారో లేక అమ్మో కేకేసి పిలవడం. "ఏం కొంపలంటేసుకొన్నాయి చెప్మా ?" అనుకొంటూ దగ్గరకొస్తే నన్ను చక్కగా దగ్గరకి తీసుకొనిమాసిపోయిన బట్టలని గురించి మందలించి, "ఇలా అయితే నీకింకేం కొనిపెట్టేది లేదంటూ" బెదిరించేసి, నాన్నారైతే జేబులోంచీ దువ్వెన తీసి ఓ సారి చెకచెకా నా తల దువ్వేసి, ఏ ముసలి భామ్మో, అమ్మమ్మో, దొడ్డమ్మో, తాతయ్యో, మావయ్యో, దగ్గరకి తీసుకెళ్ళి చేతులు కట్టుకు నిలబడమంటారు. ( నాకైతే అచ్చం బోనులో ముద్దాయిలా నిలుచున్న ఫీలింగ్.. నేను చేసిన నేరం ? ఆడుకొంటూ ఆదమరచి ఇలా పెద్దలున్న చోటు పక్కగా పరిగెత్తడం కావోసు). ఆటకాలస్యమౌతున్నా కిం కం అనలేక చుట్టూ ఉన్న జన్నాన్ని కొరకొరా చూస్తుంటే

అప్పుడో  సగటు సంభాషణ ఈ విధంగా ఉండేది

గొంతులో మమకారం ఆప్యాయతా ఉట్టిపడగా ఓ భామ్మగారి పిలుపు ..
"ఒరే బాబీ..."
వెంటనే  ఖంగుమంటూ నా గొంతు ..
"నా పేరు బాబి కాదు(సొంత పేరు మీద వల్లమాలిన అభిమానంతో రుసరుస ప్రదర్శిస్తూ)
"అదే లేరా ! పోనీ ఏంటి నీ పేరూ?" 
చిన్నూ  ...నాన్నలానే పిలుస్తాడు...చిరుకోపం తో రుసరుసలాడుతూ
అహా!  మరి అమ్మో ? " ..
" అమ్మ ఆనూ బంగారం అంటుంది" 
ఇంతలో పక్కనుండీ ఎవరో గదమాయిస్తూ 
ఒరేయ్ సరిగ్గా చెప్పరా పూర్తి పేరు. స్కూల్లో నీ పేరేంటి ? చేతులు కట్టుకొని బుద్ధిగా చెప్పూ" 
రాపాక..... వెంకట.....కేశవ.....సత్య.....సూర్య..ooooo..ఆనంద్ "  (చాంతాడంత పేరుని కాస్తా చివరికొచ్చేసరికి సగం మింగేసి)
"అమ్మెక్కువ చనువా లేక నాన్నా? ఎవరి దగ్గర గారం?
పేరు చెబ్తే పరిచయమయిపోయిందని చనువు కాబోలు  మరీన్ని అడిగి ఊదరగొట్టేస్తున్నారనిపించేది..... ప్రశ్న అర్ధం కాక అయోమయంగా  దిక్కులూ చూస్తూ,  ఓ పక్క  కళ్ళతో ఫ్రెండ్స్ ని వెతికేస్తూ....ఈ ప్రశ్నలు ఇంకా ఆగవే ? అని లోలోపల కోపిస్తుంటే  ఇంతలో ప్రశ్న మరో సారి
"అదేరా అమ్మంటే ఎక్కువ ఇష్టమా నాన్నంటేనా
నాకైతే మటుకూ ఇది బేద్ద చిక్కు ప్రశ్న !  మాజాగ్రత్తగా  జవాబు చెప్పాలి సుమా !
"ఇద్దరూ ఇట్టమే" చాలా మటుకూ ఇదే చెప్పేవాణ్ణి (ఏ గొడవా ఉండదు గనుక). ఎవరో ఒకరని నిక్కచ్చిగా చెప్పాలంటే మటుకూ కాసంతాలోచించాలి. ఐనా ఎలా చెప్పేదీ వీళ్ళెవరితాలూకో తెలీందే ! నన్ను పిలిచేటప్పుడు "ఒరేయ్ నువ్వు కాంత రెండో వాడివి కదూ? ఇలారా" అని కేకేసుంటే  ..ఓహో వీళ్ళు అమ్మ తాలూకన్నమాట ! (ఎందుకంటే అమ్మని వాళ్ళింట్లో కాంతమంటారు ’. అందుకే నేనుకూడా  "కాంతం కాంతం కాస్త శాంతం" అని ఆటపట్టిస్తాను కదా!) కాబట్టి క్చచ్చితంగా అమ్మంటేనే బోలెడిష్టమని చెప్పాలి. అలా కాక "అబ్బీ నువ్వు విస్సు రెండో కుర్రాడివేరా?" (నాన్నారిని విస్సంటారులే) అని పలకరించారనుకోండీ వెంటనే ఠపీమని నాన్నకూచి అయిపోయి నాన్నారే బాగా ఇష్టమనేయాలి
పోనీ చిట్టిబుర్రతో ఇందాకా నెగ్గుకొచ్చానని  వదిలేస్తారా ఛస్తే వదలరు. ఇదయ్యాకా ఇహ విసుగు తెప్పించే ఇంకో ప్రశ్న "నేనెవరో నీకు తెలుసునట్రా?"  (నాతో బలపం పంచుకొన్న స్కూల్ దోస్తా లేక నా సెంటురబ్బరు కొట్టేసిన టూషన్ ఫ్రెండా? ఎలా తెలుస్తుందీపిచ్చికాపోతేనూ ? ఉష్ ష్ ష్ హ్!! అయినా అందరూ నన్నే చూస్తున్నారు. కాబట్టి మానవ ప్రయత్నం చేకపొతే ఎలాగూ? అందుకే టీవీలో గ్రామదర్శినికి ముందొచ్చే కనబడుట లేదు" ప్రకటనల్లో చూపించే ఫోటోల్లో  ఈ మొహాన్ని ఎప్పుడన్నా చూసానా? (మరినాకా మొహాలే గుర్తు) అని వాళ్ళ కళ్ళల్లో కళ్ళుపెట్టి గోముగా అయోమయంగా అర నిమిషం చూసాకా అప్పుడొచ్చేది అసలు సిసలయిన ప్రశ్న 

"అదేరా నేను నీకేమౌతానో తెలుసునా?”  ఎందుకో గానీ ఈ ప్రశ్న నాకు తెగ చిరాకుపుట్టించేది. కారణం? ఈ ప్రశ్నలు ఓ పట్టాన తెవిలేవి కాదు. (పోనీ నువ్వేదైతేనేం ? నీ మనసులో నామీద ప్రేమో, అభిమానమో , ఆప్యాయమో ఏదో ఉంది మొత్తానికి. సంతోషించానులే ! అది చాలు కదా సీతాకోక చిలకలా హాయిగా నా మటుకూ ఆడుకొంటుంటే  ఇలా బంధించి నిలబెట్టి యక్షప్రశ్నలడగాలా ? ప్రేముంటేనూ ?)

కానీ ఎంతో మంచివాణ్ణికాబట్టి కాసేపు ఆలోచించినట్టే చించి
"నువ్వా? ఏమో నీకు తెలుసుగా నాతెలీదు" ..అంటూ పరుగందేసుకోడం అలా ఆటల్లో పడిపోడం.  మీ పిల్లలకి బంధుత్వాలు అవీ సరిగ్గా నేర్పట్లేదు రేపు వాళ్ళకి ఎవరు ఎవరో  ఎలా తెలుస్తుందంటూ అమ్మా నాన్నల దగ్గర ఎవరన్నా పెదవివిరిస్తే, మరిన్ని సార్లు బోనులో నిల్చోవాల్సొచ్చేది. మెల్లె మెల్లెగా జవాబు సరిగ్గాచెప్పేస్తే వదిలేస్తారన్న ఆశ పెరిగి  పెరిగి ఈ ప్రశ్నకి కొన్నేళ్ళకి నా జవాబులో మార్పొచ్చింది. వరసలూ చుట్టరికాలూ గుర్తెరిగాక, అమ్మో నాన్నో చెప్పినట్టూ "గుడ్ బాయ్"  అనిపించుకోవాలనే ఎరకి లొంగిపోయి,  బుద్ధిగా చేతులు కట్టుకొని, పరిచయాల ప్రశ్నల వరకూ చకచకా చెప్పేసాకా ...మళ్ళీ అదే జిడ్డు ప్రశ్న 

" నేనెవరో నీకు తెలుసునట్రా ? అదే రా నేను నీకేమౌతానో తెలుసునా? " అంటూ
"ఇంగో ! ముందు నేను నీకేమౌతానో చెప్పూ అప్పుడు చెబ్తాను నువ్వేమౌతావో" అని ఠీవిగా సవాల్ విసిరితే, ఆ ఘడుసు సమాధానానికి  ఒక్కసారిగా  చూసే అందరూ ఫక్కున పకపకలూ, " హారి పిడుగా ! " అంటూ ప్రదర్శించిన లౌక్యానికి ప్రశంసల జల్లులు..

కొందరో అడుగు ముందుకేసి వరస చెప్పి ఏమవుతారో అడిగేవాళ్ళు. ప్రశ్నలు సరళంగా "మీ అమ్మకి నేను పెద్దత్తయ్య అవుతాననుకో , అప్పుడు నేనేమౌతాన్రా నీకూ?"  లాంటిదనుకోండీ, చారెడేసి కళ్ళు కాస్తా ఇంకో అంత పెద్దవి చేసి, మొహం దీపావళి మతాబులా వెలిగిపోతుండగా "బేద్ద... బేద్ద... భామ్మ గారు" అనేసి అందరూ చప్పట్లు కొట్టేలోపూ చల్లగా జారుకోడం  ఆనవాయితీ. అలా కాక ఓ తాను పొడవుండే చుట్టరికాలుండేవి. మచ్చుకి ఇలా అన్న మాట  "మీ అమ్మ నాకు పినతండ్రికి.... మేనత్త ..వేలు విడిచిన.... గోరు విడిచిన.....శేరు శెనగపప్పు అరువడగడానికొచ్చి మీ వంటింట్లోకాఫీ గ్లాసు విడిచిన ….. పంచదార స్పూను విడిచిన ......తోడికోడలి... కూతురనుకో....."  (ప్రశ్న ముగించకముందే) "వార్నీ ! ఇంత బేద్ద బీరకాయపీచు చుట్టరికాన్నీ  గుర్తుంచుకొని బుద్ధిగా పెళ్ళికొచ్చింది ఇలా నా ప్రాణాలు తోడ్డానికా?”  అనిలోలోపలే ఆక్రోశిస్తూ మళ్ళీ పరుగందుకొని ఆటల్లో పడ్డం రివాజుఎట్టకేలకూ ఇంకాస్త పెద్దయ్యకా ఈ చొప్పదంటు ప్రశ్నలనుంచీ విముక్తిపొందే కిటుకు తెలిసిందిఏ ముహుర్తాన ఎలా అబ్బిందో గానీ ఆ ఙ్ఞానానికి జోహార్లు. అది "నేను నీకేమౌతానో తెలుసునా ?"నీకు వరసకేమౌతానో చెప్పుకో చూద్దాం  లాంటి తలతిక్క ప్రశ్నలకి రామబాణంలా పంజేసేది ఆ విరుగుడు ఇలా ఉంటుంది.  
నాకుగా నేనే వెళ్ళి  "నువ్వు నాకేమౌతానని అడుగు చెబ్తాను" అంటే,
ఏ పెద్దవాళ్ళో ఆత్రంగా "నేను నీకేమౌతాను రా ! " అనేవారు.
అద్దీ లెక్క..సరైన ప్రశ్న సరైన విధంగా అడిగారన్న ఆనందంతో కళ్ళు వెలిగిపోయేవి.. పిల్ల రాక్షసుడిలా ఓ క్రూరమయిన నవ్వు పెదాల అంచున తొణికిసలాడగా..దాన్ని అలానే ఆపేసుకొంటూ.. "ఓస్!  ఏం అవుతావేం ? ఇలా పైకేగరేస్తే అలా కిందపడి రెండు ముక్కలౌతావ్ ? హి హి హీ బాగా చెప్పానా? ఏ ఇంకోసారడుగుతావా ఈ దెబ్బకీ ?? హి హి హీ "  ఇదీ వరస.
                      ఇలా చేసినందుకు "అయ్యో పాపం అనిపించినా, ఆహ్ ఎం పర్లేదులే నన్నడిగినప్పుడులేదే మరీ? " అనికూడా అనిపించేది. నేనడిగేప్పుడు మాత్రం "నువ్వు నాకేమవుతావ్ అనడుగుతాను" అలా అడిగించుకొన్నా ఇలా అడిగినా ఎలా అయినా నాకేం పర్లేదు. అదీ లౌక్యం.
                    మొత్తానికి పొట్టినిక్కరుల్లోంచీ ఫాంటుల్లోకీ సూటూబూటుల్లోకీ వచ్చేసాను, మూతి మీద మీసమొచ్చిందీ, గడ్డం మీద గ్రీనరీ వచ్చిందీ, వెరసి హుందాగా పాతికేళ్ళ వయసొచ్చింది. ఈ లోపు నాకు తెలిసింతవరకూ వరసలూ చుట్టరికాలూ గుర్తుపెట్టుకొన్నాను. వాటి ప్రకారమే పిలుస్తాను కూడా. కానీ ఈ రోజుకీ మళ్ళీ అదే ప్రశ్న అప్పుడప్పుడూ ఎదురౌతుంటుంది. " నేను నీకేమౌతాను ?" అంటూ చిలిపిగా. గౌరవం, ఇష్టం , అభిమానం,  ప్రేమా, మమకారం, అనురాగం,  భావమేదైనా స్థూలంగా అది మనసుభాషలో ఓ "ఇష్టం". కానీ  మీరు గమనించాలి అవి నాబోటి బోనులో ముద్దాయికి సంకెళ్ళు. (అలా అని వాటికి నేను ఫక్తు వ్యతిరేకిని కాను సుమా!) ఉన్నదేదయినా మొహానికి పౌడర్ లా రాసుకోనక్కర్లేదు. మనసు పొరల్లో దాచుకొంటే  చాలు పైన చెప్పిన పెద్దల ప్రేమలా ఏనాటికైనా గుభాళిస్తాయి. 

ఇంత చెప్పకా తారకరాముడు సినిమాలో ఓ పాటకి సిరివెన్నెల రాసిన రెండు వాక్యాలతో ముగిస్తాను.
 మన సోంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు 
  మనమంతా మావులమే ఆ బంధం చాలంటారు
             అనుకోడంలోనే అంతా ఉందని పెద్దలు అంటారు  "  అని 
 (స్థూలంగా ఈ టపా సారంశం అదే అని వేరే చెప్పక్కర్లేదనుకొంటాను)

ఇంకా అనుమానముంటే అడగచ్చు :)

(అన్నట్టూ ఎందుకో మళ్ళీ చిలిపిగా నా కళ్ళల్లు మెరుస్తున్నాయి, పెదాలపైకి పిల్ల రాక్షసుడి నవ్వొస్తోంది.. ఆపుకొంటున్నాను లెండీ )

 ఏదీ ఓ సారి "నేను నీకు ఏమౌతాను" అని అడగండి ? ..అహ...అడగండి చెబ్తా !
  (హ హ హా !! )

(అయ్యా! నేనో ఘడుసు బ్లాగర్ నన్న విషయం తమరు మరిపోకూడదు)


6 comments:

రసజ్ఞ said...

హహహ బాగుందండీ చివ్వరిదాకా చాలా సరదాగా సాగింది. ఇంతకీ ఇక్కడ వ్యాఖ్యలు రాసే మేము మీకేమవుతాము? ఇది చెప్పండి ముందు!!!

ramya.upadrasta said...

hahhhaa......chala navvu vachindi.......super like......:P

నందు said...

ఇంగో ! ముందు నేను మీకేమౌతానో చెప్పండీ అప్పుడు చెబ్తాను మీరేమౌతారో ( ఠీవిగా):)

నందు said...

@ రమ్య గారూ: ధన్యవాదాలు !

Anonymous said...

పంచదార స్పూను విడిచిన ......తోడికోడలి... కూతురనుకో....." (ప్రశ్న ముగించకముందే) "వార్నీ ! ఇంత బేద్ద బీరకాయపీచు చుట్టరికాన్నీ గుర్తుంచుకొని బుద్ధిగా పెళ్ళికొచ్చింది ఇలా నా ప్రాణాలు తోడ్డానికా?”

For these lines couldn't stop laughing asalu non-stop 5 mins. Over all nice and funny , Keep it up.

నందు said...

శ్రేయసీ గారు ధన్యవాదాలు :)