img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Sunday, May 1, 2011

శిక్షా"స్మ్రుతి" !

( అందమైన బాల్యం గురువుల చేతుల్లో మొగ్గతొడగాలి భయాలూ బాధలనడుమ చితికిపోకూడదు. అందుకే ఈ కాలం )


వెనకటికెవరో "దండం దశ గుణం భవేత్" అన్నారు .. మా తాతగారూ ఇదే అనేవారు. ఆయన హెడ్ మాష్టారు చేసారు. వాళ్ళ నాన్నగారు "దెబ్బ దెబ్బ దేవేంద్రలోకం" అనేవారట. ఆయనేంచేసేవారో నాకు తెలీదు. కానీ ఆలోచించగా ఆలొచించగా నాకోటనిపిస్తుంటుంది. పాతకాలంలో దండించడం మీదా శిక్షించడం మీద జనాలకి మంచి నమ్మకం ఉండేదేమో అనీ, అదే ఈ పదప్రయోగాల్లోకి తర్జుమా అయ్యుంటుందనీ. అలా అని ఈ కాలంలో నమ్మకం లేదని కాదు ఈ రోజుల్లోనూ ఉంది అది వేరే విషయం.  

అసలు శిక్షించడం ఎందుకు ? దాని పరమార్ధం ఎమిటీ ? ఇత్యాది ప్రశ్నలకి జవాబులు వెతుకుతూ బాగా లోతుల్లోకి వెళ్తే శిక్ష యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. దానికి ఉన్న ప్రాధమిక ప్రయోజనం ఒక్కటే అయినా మన నిజజీవితంల్లో అది ఎన్నో వైవిధ్యమైన ముఖాలతో కనిపిస్తుంది. 

మనం చిన్నప్పుడు ఏదో తప్పుచేస్తాం, టీచర్ గారు బెత్తం తో కొడతారు పర్యవసానంగా నొప్పి కలగడం, కళ్ళవెంబడి నీళ్ళు రావడం, మనసులో భాదకలగడం,  వెరసి చివరగా ఒక మార్పు "మరెప్పుడూ ఈ తప్పు చేయకూడదు" అనే గట్టి సంకల్పం మనసులో ఏర్పడటం జరుగుతాయి. ఈ చిట్టచివరి కార్యమే బెత్తం తో దండించడం అనే శిక్షకి పారమార్ధం. మరయితే  మాష్టారు అదే విషయం ముందు చెప్పి ఉండచ్చుకదా ? మంచిమాటల్తో చెబ్తే మనం వినం కదా ! అందుకే ఈ శిక్ష . కేవలం దండించడంతో మార్పు సాధ్యం కాదు. కానీ శిక్ష యొక్క ఏకైక లక్ష్యం మార్పు. 

దీన్నే ద్ర్హువపరుస్తూ ఎన్నో ఉదాహరణలు మనకి కనిపిస్తాయి. చేసిన తప్పు వల్ల కలిగే నష్టాన్ని గుర్తుచేసేలాంటివే మన సనాతన శిక్షలు. గరుడపురాణాంలో ఇలాంటివి చక్కగా కనిపిస్తాయి. ఉదా:ఎవరికైనా నీళ్ళు లేకుండా చేసిన పాపానికి  నీళ్ళు లేని యెడారిలో ప్రాణంపోకుండా ఎండలో అల్లాడిపోడం ఒక శిక్ష. అలానే ఎవరికైనా ఆహారం దూరంచేస్తే ఆకలితో అలమటిచాల్సి రావడం లాంటివీనూ. పాపాల మాటిలా ఉంటే అటు పుణ్యాలు కూడా ఏ కోవలో మంచిచేస్తే ఆ కోవలోని పుణ్యాలే వస్తాయి. ఇదే మనకి కార్తీక మాస విశిష్టతలోనూ కనిపిస్తుంది. చలికాలంలో ఎవరికైనా కంబళి దానం చేస్తే మనకి ఎప్పుడూ చలిబాధలు రాకుండా ఉంటాయనీ, ఎండాకాలంలో విశెన కర్రలు దానం చేసి చలివేంద్రాల్లాంటివి ఏర్పాటుచేస్తే ఎప్పటికీ మనకి దప్పిక పీడించదనీ, వేడిమి బాధలు ఉండవనీ అంటారు. 

           కాని శిక్ష అపరాధి మార్పు చెందకా నిలిపేస్తారు. ఆగస్టు 15న జనవరి 26న  పరివర్తన చెందిన అపరాధుల విడుదల , కొందరికి రాష్ట్రపతి క్షమభిక్ష లాంటివి ఇందుకు నిదర్శనాలు. కానీ అన్ని శిక్షలూ ఇదే పరమార్ధాన్ని సాధిస్తున్నట్టూ ఉండవు. ఉదా : యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష లాంటివి ముద్దయిని సమజం నుంచీ దూరంగా ఉంచి తద్వారా శాంతినెలకొల్పేందుకేమో అనిపిస్తాయి. లేకపొతే ఉరి తీసాకా మనిషిలో మార్పుకి చోటేదీ ?

         ఉన్నతమైన శిక్షలూ కొన్ని ఉంటాయి. అవి ఉన్నతులే వేస్తారు.వాళ్ళు విధించే శిక్షల్లో వాళ్ళ ఔన్నత్యం కనిపిస్తుంది. అవి మధ్యలోని బాధల ని దాటించేసి ఏకంగా మార్పుని కలిగిస్తాయి. ఇవి చేదు రోగాలకి తీపిమందుల్లాంటివి. ఉదా: ఒక సారి కంచిపరమచార్య స్వామి మఠంలో పరిచారకుడొకతను తన తలకింద మూట పెట్టుకొని నిద్రపోతున్నాడు. అందులో ఏముందో అని విప్పిచూసిన మఠం తాలూకూ నౌకరుకి వంటింటి నుంచీ తస్కరించిన మూడు పడుల మినప్పప్పు కనిపించింది. అదే స్వామి వారికి వినిపించాడు. అందుకు స్వామి ఇలా అన్నారుట " ఆ పరిచారకుడికి మినప్పప్పుతో చేసే వడలు ఇష్టంలా ఉంది ఒక పని చేయండి ఈ మూడు పడుల పప్పునీ బాగా నానబెట్టి రుబ్బి అల్లం పచ్చిమిర్చి జీలకర్రా లాంటివి కావల్సినంత వేసి వడలు చేసి ఆ పరిచారకుడికి కావల్సినన్ని పెట్టండి తను త్రుప్తిగా భోంచేయాలి " అని. అది మొదలూ ఆ పరిచారకుడు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకుండా తన తప్పు దిద్దుకొన్నాడు. 

       కానీ ఇలాంటి ఉన్నతమైన శిక్షలకి ప్రతిస్పంచించడానైకి సంస్కారమనే సునిసితత్వం కావాలి. ఇలాంటి శిక్షలు  తీపిమందులుగా కనిపిస్తాయి మాత్రమే. మంచితనం, వ్యక్తి శీలం, క్షమాభావం లాంటి వాటినుపయోగించి దండించినప్పుడు  తప్పుచేసిన వ్యక్తి మనసు కలుక్కుమంటుంది. మనసులో మార్పు మొదలౌతుంది. ఆ మార్పు శాస్వతమైనదీ నమ్మదగ్గదీను. 

        ఇహ పొతే లక్ష్యం మీద ధ్యాస లేకుండా విధించే శిక్షలు ఏ ప్రయోజనాన్నీ సాధించవు అని నాకనిపిస్తుంది. అసలు ఎందుకు శిక్షిస్తున్నాము ఈ శిక్ష వల్ల ఫలానా వ్యక్తిలో ఏ కొంచమైనా మార్పొస్తోందా లేదా అనేవి చూసుకోవాలి. కానీ చాలా మంది ఇది చేయరు. ముఖ్యంగా జీవితానికి పునాది పడే పాఠశాలల్లో ఇది ముఖ్యంగా కనిపిస్తుంది. తద్వారా అనాలోచిత శిక్షలు ఎక్కువవుతాయి.శిక్ష పడ్డ వ్యక్తి చదువుమీద అయిష్టత టీచరు మీద అక్కసు పెంచుకోడం, అలాగే టీచరు గారికి ఆ విద్యార్ధి మీద ఏవగింపు చులకనభావం కలగడమూ జరుగుతుంది. ఇదే నా విషయంలోనూ జరిగింది. కలలో బెత్తంతో మాష్టార్లు కనబడితే నిద్రలేని రాత్రిళ్ళు గడిపాను, బడంటే భయం పట్టుకొని ఎక్కడికైనా పారిపొయే ఆలోచనా చేసాను. మా స్కూల్లో టీచర్లు చదవనీ, హోంవర్కులు చేయనీ, పరీక్షల్లొ ఫయిల్ అయ్యే వాళ్ళనీ మూసపోసినట్టూ కొట్టేస్తారు. అంతే..అసలు ఎందుకు చదవలేదు , ఎందుకు హోం వర్క్ చేయలేదూ, సమస్య ఎక్కడుంది?.. ఇలా రోజూ బడితీ బాజాలు మోగించడం వల్ల ఏమన్నా ఉపయోగముందా? లాంటివి అస్సలు ఆలోచించే వారే కాదు. మా చిన్నప్పుడు నేను హోంవర్క్ చేయలేదనుకోండీ ఆ రోజు గబుక్కున ఏ కడుపునొప్పో తలనొప్పో వచ్చేస్తుంది. అది రివాజు. గ్రహపాటున వెసిన అన్ని ఎత్తులూ చిత్తయి బడికెళ్ళక తప్పలేదనుకోండీ, అప్పుడు మా టీచర్ గారు కొడితే బాధల నుంచీ తప్పించుకోడానికి పై ఎత్తులు నా దగ్గరుండేవి. తలకి బాగా నూనె రాసుకొని టీచరు గారు కొట్టబోయే ముందు ఎవరూ చూడకుండా దాన్నే అరిచేతులకి కాసంత అంటించుకొంటే టీచర్ గారి వెదురు బెత్తం కేసి చూసి చిరునవ్వు నవ్వి " ఇంకో రెండు దోశలు వేడి వేడిగా" అని నిర్భయంగా చేతులు చాపేయచ్చు . అలా దెబ్బపడడం ఇలా సర్రున జారిపోడంతో మనకి అట్టే దెబ్బతగలదు. ( అరచెయ్యిని బెత్తం కింద కాసంత వంపుతో పెట్టాలి సుమా ) ఈ కిటుకెవరికీ చెప్పకండి ..ఇటు మేం ఇలా కిటుకులు కనిపెడుతున్నామో లేదో అటు మాకు పీకలదాకా వడ్డించడానికి మా గురువుగార్లు చక్కని లోపాయకారీ ఉపాయాలాలోచించేవారు. ఇంట్లో వడ్రంగి పని జరిగితే రెండు కేన్ కర్రలు అట్టేపెట్టుకొన్న టీచర్లూ ఉన్నారు . అలా బడిత పూజ చేయించుకొన్నాకా అప్పుడప్పుడూ క్లాసు బయట మోకాళ్ళమీద నుల్చొవాల్సిరావచ్చు. నేను ఒక్కడినే అలా నుంచుంటే నాకు తగని బాధగా ఉండేది. కానీ  ఏ ఒక్కరు తోడున్నా ఎందుకో లోలోపల సంతోషం. అలా నాకు క్లాసు బయట తోడైన నేస్తాలతో పంచుకొని తినడానికి జేబులో చెగోడీలూ, పుల్లారెడ్డి స్వీట్లూ పట్టికెళ్ళిన రోజుల్లేకపొలేవు.. అలా కష్టల్లో సుఖాలు ఏర్పరుచుకోడాలు మా టీచరు గారు చూసి క్లాసులోనే బెంచీమీద నుంచోబెట్టిన వైనాలూ ఉన్నాయి.

     అసలుకి తిట్లూ దెబ్బలూ ఆశిర్వాదాలంటారు. ఆ ప్రకారం నాకు బానే ముట్టాయని చెప్పాలి.ఓ సారి దసరా శెలవకిచ్చిన లెక్కల హోం వర్కు చేయలేదనీ మోకాళ్ళమీద స్కూలంతా నడిచాను. నా కొచ్చిన ఆశిర్వాదల్లో దానిదే అగ్ర తాంబూలం. ఇక తిట్ల అక్షతలంటారా అవి ఎప్పటికప్పుడు దులిపేసుకొంటాను కాబట్టి పెద్దగా గుర్తులేవు. అప్పుడప్పుడూ మా ఇంగ్లిష్ టీచర్ గారు తిట్టే తిట్లు చెవిలో చేరి చక్కిలిగిలి పెడుతుంటాయి.. "కంట్రీ బ్రూట్" "డర్టీ రోగ్" లాంటివి.. "సిటీ బ్రూట్స్" .."నీట్ రోగ్స్" అని ఎందుకనరూ ? అని అప్పట్లో నిఖార్సైన సందేహాలూ కలిగేవి ..అది వేరే విషయం.

        వెరసి యేళ్ళతరబడి జరిగిన తంతల్లా ఒక్కటే చదవని మొద్దులని ఎంతబాగా దెబ్బతగిలేలా కొట్టచ్చు అని టీచర్లూ, ఆ కొత్త ఎత్తులకి పై ఎత్తులు ఆలోచిస్తూ నాబోటి మొద్దబాయిలూ కాలం గడిపాం. విరిగిన బెత్తాలూ చేతుల్లో ఆణెలూ మిగిలాయిగానీ ప్రయోజనం సున్నా.  

ఈ రెండున్నర దశాబ్దాల విద్యార్ధి జీవితం, రెండున్నరేళ్ళ అధ్యాపక జీవితంలో చదువనే నాణానికి బొమ్మా బొరుసూ చూసాను. విధ్యార్ధిగా అధ్యాపకుల వైపు చూసాను ఒక అధ్యాపకుడిగా చదువుకొనే పిల్లల వైపూ చూసాను.  

     క్లాసులో వెనక బెంచీలో కబుర్లాడుకొనే రోజుల నుంచీ ఒక టీచరుగా బోర్డు ముందు నిలబడి పాఠం చెప్పాల్సొచ్చినప్పుడు విద్యార్ధులుగా మేము చేసిన పొరపాట్లు టీచర్లని ఎలా విసిగిస్తాయో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాయి. మా టీచర్లు ఫిర్యాదు చేసిన సందర్భాలు - పాఠం చెప్పేటప్పుడు మాట్లాడద్దు,ఆవులించద్దు నిద్రపోవద్దు, పరీక్షల్లో అడిగినదానికి మాత్రమే క్లుప్తంగా సమాధానమివ్వండి చాటభారతాలు రాయకండి, మంచినీళ్ళు తాగడం, ప్రక్రుతిని పలకరించడం అన్న నెపంతో ఇద్దరు కలిసి వెళ్ళకండి, క్లాసుబయట బాతాఖానీలు పెట్టకండీ, ఇలా అనేకం.  ఇలాంటి కొన్ని విద్యార్ధి జాఢ్యాలు దేశ, ప్రాంత, భాషా, సాంస్క్రుతిక, వర్ణ,కాల బేధాలకి అతీతాలు. ఇవే నేను అనుభవపూర్వకంగా అమెరికాలో చూసాను. కాపోతే ఇక్కడ పిల్లలు కొన్ని పైయెత్తుల విషయల్లో మా రోజుల్లో కంటే వెనకబడ్డా కొన్ని విషయాల్లో మాత్రం మహా ముదుర్లు.  

నా టీచింగ్ పార్శ్వం వైపు ఇంత ఉపోద్ఘాతమిచ్చాకా , మా రోజుల్లో అక్కడి శిక్షా సూత్రాలు ఇక్కడెలా అక్కరకొచ్చాయో చెప్పి ముగిస్తాను. 

మన దగ్గర టీచర్ క్లాసులొ లేనప్పుడు పిల్లలు గోలచేస్తారని క్లాస్ లీడర్ అని మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళనొకళ్ళని పెట్టి, క్లాస్లో చదువుకోకుండా మాట్లాడుతున్న వారి పేర్లు బోర్డు మీద రాయమంటారు. ఆ  పిరియడ్ అయ్యకా తర్వాత క్లాసు టీచర్ వచ్చి ఆ జాబితాలో పిల్లలకి అప్పచ్చిలిస్తారు. ఇదీ ఆనవాయితీ. ఓ సారిలాగే మా క్లాసులో టీచర్ లేకపోతే క్లాస్ లీడర్ కి కాకుండా పెత్తనం నాకిచ్చారు. అదేం వింతో క్లాసు నిశ్శబ్దంగా బానే నడిచింది.ఏవో కొన్ని పేర్లు బోర్డెక్కాయి. ఆ తర్వాత అప్పచిల పంపకం అంతా షారా మామూలుగా గడిచాకా, మా టీచర్ గారిని అడిగాను "పేర్లు రాసే పెత్తనం నాకెందుకిచ్చారు" అని అందుకావిడ చిన్నగా నవ్వి అన్నారూ "పేర్లు రాస్తున్నారన్న భయం లేకుండా నువ్వు మాట్లాడతావు నువ్వు నీ సీట్లో ఉంటే నీ బెంచీ దాంతోపాటే వెనక రెండు బెంచీలూ అల్లరి చేస్తారు. నిన్ను నీ గుంపు నుంచీ వేరు చేసి అలా నిలబడితే క్లాసులో అందరినీ గమనిస్తూ నువ్వు బిజీగా ఉంటావు ఇంక అల్లరికి ఆస్కారమేదీ" అని

నాకాశ్చర్యమేసింది !  నన్ను బురిడీ కొట్టించిన టీచర్గారి తెలివి అమోఘం. నిజానికి నేను సీట్లో ఉంటే, నా పేరు రాస్తే, నాకు శుచిగా రుచిగా అప్పచ్చిలు వడ్డిచ్చేస్తే  క్లాసు నిశ్శబ్దంగా ఉండాలనే ప్రయోజనం నెరవేరకపొయాకా ఏ లాభం ? అందుకే  ప్రయోజనాన్ని సాధించిన ఆ తెలివి నాకు నచ్చింది. 

ఇదే నేను టీచరు గా ఉన్నప్పుడు అమల్లో పెట్టి ఇంకోసారి ఆశ్చర్యపోయాను. ఇక్కడ  అమెరికాలో విద్యార్ధులందరి దగ్గరా సెల్ ఫోన్స్ ఉంటాయి. క్లాసులో సెల్ల్ వాడకం నిషిద్దమని డెపార్ట్మెంటు ఆంక్షలు పెట్టినా గప్ చుప్గా టెక్స్ట్ మెసజీలు పంపుకొనే వాళ్ళు ఉంటారు. మేగన్ వేసల్ అనే మా విద్యార్ధిని లాబ్ నడిచే అంతసేపూ సెల్ల్ వదిలేది కాదు. నేను చెబితే పక్కనపడేసేది. నేను అటు తిరిగాకా షరా మామూలే. పాతపద్దతిలో భాగంగా పని దొంగ చేతికి పెత్తనమిచ్చాను. అందరిముందూ చిట్టీలేసి ఒకరిని ల్యాబ్ రెప్రజెంటేటివ్గా ఎన్నుకొన్నాను. ఏ కోల్డ్ రూంలో స్పెసిమెన్స్ తేవడానికో నేను వెళ్ళి  ల్యాబులో లేనప్పుడు క్లాసులో అందరినీ కనిపెట్టుకుండాలి, నేనున్నంత సేపూ తను నాకు అసిస్టెంట్గా ల్యాబ్ సజావు నడిచేల సహకరించాలి. ఇంతచేసినందుకూ తనకి 10% మార్కులు అదనం ఇదీ ఒప్పందం. మేగన్ వేసల్ ని ఆ పదవిలో కూర్చోబెట్టాను తన సెల్లుకి విశ్రాంతి,  రెండు నెలల్లోనే మేగన్ మార్కుల్లో ప్రగతి చూసాను. నిజానికి 10 % మార్కులూ నేనివ్వలేదు బాధ్యతనే బెత్తంతో తనలో వచ్చిన మార్పే అది. 

అందుకే నా వరకూ ఐతే శిక్షంటే సంస్కరించడమే కేవలం దండించడం కాదు.గురువులు దండనాయకులు కాదు స్పూర్తి ప్రదాతలు !

కొసమెరుపు : చివరగా మీకో సందేహం కలగచ్చు .నేను మేగన్ నే ఎలా క్లాస్ రెప్రజెంటేటివ్ చేసానా అని.వేరే చెప్పాలా ! అన్ని చీటీల్లోనూ ఒకే పేరు.. మేగన్ వేసెల్ ..( అల్లరి పిల్లలు టీచర్లయితే అంతేగా మరి )8 comments:

Pavan said...

Excellent post in simple words...

A splendid tale of the discovery & application of reformation as the essence behind punishments, narrated by a mischief maker with the incidents in his journey to become an ideal educator!!

Anand said...

Pavan gaaru Thank you sir !

lamp19 said...

మీ కధనం చాలా బాగుంది. అన్నీ తెలిసిన విషయాలే అయినా చదువుతుంటే భలే అనిపించింది. ఇంకా ఇంకా రాయండి. పాటలపెట్టెలో ఒకే పాట మళ్ళీ మళ్ళీ వసో్తంది. వీలైతే మార్చండి.

praneeta said...

nice posting.school gurinchi teachers gurinchi
almost andariki common experiences untai.
ivi chaduvutu unte na school days gurtochay.
thanks for making me remember all those sweet days

Anand said...

@ lamp19 : ధన్యవాదాలు !
@ ప్రణీత గారు : ధన్యవాదాలు !

Shreya said...

Narration చాలా బాగుంది.ఎవరికైనా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి చదివితే. నేనూ బోర్డ్ మీద నేంస్ రాసా చాలా సార్లు :) ఎప్పుడూ టీచర్ చేత దెబ్బలు తినలే నీలాగా :) హ హ హ ..ఒవర్ ఆల్ సూపర్ గా ఉంది ఈ పోస్ట్.. Keep it up !

నందు said...

శ్రేయసీ గారు ధన్యవాదాలు

Usha Gurajada said...

ఆనందూ
నీ చిన్నప్పటి స్కూల్ లో విషయాలు చదువుతుంటే ముచ్హట గా ఉంది. స్కూల్ చుట్టూ మోకాళ్ళమీద నడిచిన దానికి అగ్రతాంబూలమిచ్చి గౌరవించడం చాలా బాగుంది.అర చేతులకు తలకు ఉన్న నూనె రాసుకోవాలన్న చిట్కా చాలా మంది అల్లరి పిల్లలకి పనికివస్తుంది . ఇలాగే మంచి మంచి పోస్ట్ లను పెట్టమని కోరుతున్నాను.